ISRO Internship: ఇస్రోలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం.. అర్హతలు ఇవే!

NEWS DESK
1 Min Read

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం యువతకు అందుబాటులో ఉంది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువత కోసం ఇస్రో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో పనిచేసే అనుభవం భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉన్నత విద్యకు ఎంతగానో ఉపయోగపడనుంది.

సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు లేదా 10లో 6.32 CGPA సాధించి ఉండాలి. భారతీయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇస్రోకు చెందిన వివిధ యూనిట్లు, విభాగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి ఇంటర్న్‌షిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికెట్ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యకు ఉపయోగపడే అవకాశం ఉంది.

అయితే ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎలాంటి స్టైపెండ్ లేదా పారితోషికం ఉండదు. వసతి, భోజనం తదితర ఖర్చులను ఇంటర్న్‌షిప్ చేసే అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా, ఇస్రోలో సిబ్బంది కొరతపై కూడా ఇటీవల చర్చ జరుగుతోంది. సంస్థలోని మొత్తం 20,269 పోస్టులకు గాను 5,632 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. సుమారు 28 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండున్నర దశాబ్దాల తర్వాత ఇస్రోలో ఈ స్థాయిలో ఖాళీలు ఏర్పడినట్లు సమాచారం.

📄 Generate e-Paper Clip
Share This Article