సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)లో స్కై బకెట్ ల్యాడర్ వాహనాల అద్దె టెండర్లు చర్చనీయాంశంగా మారాయి. మార్కెట్ ధరల కంటే పలుమార్లు అధిక అద్దెలు నిర్ణయించడం, అవసరానికి మించి వాహనాలను అద్దెకు తీసుకోవడం, తక్కువ ధరలు కోట్ చేసిన సంస్థలను పక్కనపెట్టడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించిన ఈ వాహనాలను ప్రస్తుతం ప్రతి సర్కిల్‌కు కేటాయిస్తూ ఏడాది పొడవునా అద్దె చెల్లించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.
మార్కెట్లో రూ.23 లక్షల విలువ చేసే వాహనానికి నెలకు సుమారు రూ.3.50 లక్షల అద్దె చెల్లిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 60 వాహనాల కోసం ఏడాదికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాదు, టెండర్లలో తక్కువ ధరలు కోట్ చేసిన సంస్థలను సాంకేతిక కారణాలతో తప్పించి, అధిక ధరలు పేర్కొన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇంజినీరింగ్ విభాగం బదులుగా అర్బన్ బయోడైవర్సిటీ విభాగం నిర్వహించడం కూడా వివాదాస్పదంగా మారింది.
ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజాధనం దుర్వినియోగమైందా అనే అంశాన్ని తేల్చాలని పలువురు కోరుతున్నారు.
