రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. అతడి మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే మొబైల్ ఫోన్ కూడా దొరకగా, అందులో ఈ వీడియో ఉన్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, జూలై 10న సాయంత్రం 4:55 గంటల సమయంలో రాజ్‌కుమార్ ఈ వీడియోను రికార్డ్ చేశాడు. తన జీవితంలో ఎదురైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వీడియోలో పేర్కొన్నాడు.
వీడియోలో మాట్లాడుతూ, “నా సంపాదనలో సగం వాళ్ల కోసమే ఖర్చు చేశా. నన్ను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని రోడ్డున పడేశారు. ఆ అమ్మాయిని నమ్మి సర్వస్వం కోల్పోయాను. అప్పుల పాలయ్యాను. నా పిల్లలకు ఇవ్వడానికి రూపాయి ఆస్తి కూడా మిగలలేదు. చివరకు నాపైనే కేసులు పెట్టి జైలుకు పంపించారు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

నమ్మిన వారే తనను మోసం చేశారనే కక్షతో రాజ్‌కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలుతోంది. ఇదే సమయంలో, హత్యల సమయంలో ఒక బాలిక కారులోనే ఉన్నట్లు వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. మొబైల్ ఫోన్‌తో పాటు వీడియోను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని సీపీ తరుణ్ జోషి తెలిపారు.
అసలేం జరిగిందంటే?
తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో రాజ్‌కుమార్ జూలై 10న ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ముందుగా షాబాద్ పట్టణంలో మైనర్ బాలిక తల్లి, నాయనమ్మలను హత్య చేసిన అతడు, అనంతరం తన భార్య, పిల్లలను కూడా కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి అఖిల్ సాగర్ చెరువు సమీపంలో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపగా, పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే, చివరకు రాజ్‌కుమార్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.