రైతులు వర్షం కోసం ఎదురుచూస్తుంటే.. లక్ష క్యూసెక్కుల నీళ్లు వృథా అవుతున్నాయి: కేటీఆర్

NEWS DESK
2 Min Read

హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో నిర్వహించిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు క్యామ మల్లేష్, హమాలీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద భారీగా నీరు వృథాగా కిందికి వెళ్తోందని ఆరోపించారు.

“నిన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్లి పరిస్థితిని పరిశీలించాం. మేడిగడ్డ బ్యారేజ్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి పంప్‌హౌస్ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఆకాశం వైపు చూస్తూ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు కిందికి వృథాగా పోతోంది” అని కేటీఆర్ అన్నారు.

కరువు పరిస్థితుల్లో కూడా రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. గోదావరిలో నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ, పంపులు ఆన్ చేయకపోవడం వల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదని విమర్శించారు.

“ముఖ్యమంత్రికి మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకోవచ్చు. రాజకీయంగా ఏమైనా చేయవచ్చు. కానీ ఆ కోపాన్ని రైతులపై చూపొద్దు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రెండు పంపులు ఆన్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు” అని కేటీఆర్ మండిపడ్డారు.

రైతులకు నీరు అందిస్తే యూరియా సరఫరా చేయాల్సి వస్తుందని, పంటలు పండితే కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుందని, మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని భావించి ప్రభుత్వం సాగునీరు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

“నీళ్లు ఉన్నా పంటలను ఎండబెడుతున్నారు. రైతులను ప్రభుత్వం తొక్కుతోంది” అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

📄 Generate e-Paper Clip
Share This Article