తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల రైతులకు అందిస్తున్న క్వింటాకు రూ.500 బోనస్ పథకానికి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. 2026 వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్న వరి విత్తనాలను సాగు చేసిన రైతులకు మాత్రమే బోనస్ అందించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే బోనస్ పంపిణీలో పారదర్శకత పెంచడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కోసం ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇకపై ఆర్‌ఎన్‌ఆర్–15048, బీపీటీ–5204, కేఎన్‌ఎం–1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాల సన్న వరి విత్తనాలను సాగు చేసిన రైతులకు మాత్రమే బోనస్ వర్తించనుంది. ఈ ఏడు రకాల పంటలకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్ రికార్డుల్లో తప్పనిసరిగా నమోదై ఉండాలి.
విత్తనాల కొనుగోలు వివరాల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విత్తన డీలర్లు తాము విక్రయించిన సన్న వరి విత్తనాల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి. రైతు పేరు, తండ్రి పేరు, విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నంబర్, ప్యాకెట్ పరిమాణం, కొనుగోలు తేదీ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డీలర్లు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా లాగిన్ అయ్యే సదుపాయం కల్పించారు.

ఈ డిజిటల్ విధానం 2026 వానాకాలం సీజన్‌లో విక్రయించే విత్తనాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు డీలర్లు విత్తనాల విక్రయ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
విత్తన డీలర్ల వద్ద కొనుగోలు చేయకుండా సొంతంగా భద్రపరుచుకున్న విత్తనాలతో సాగు చేసే రైతులు తమ మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలి. వ్యవసాయ శాఖ యాప్ ద్వారా రైతులు స్వయంగా కూడా విత్తన రకం వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
ఆన్‌లైన్‌లో నమోదైన అర్హులైన రైతులకే సన్న వడ్ల బోనస్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులు ముందుగానే తమ విత్తనాల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.