E20 పెట్రోల్‌తో పాత కార్లకూ నష్టం లేదన్న మహీంద్రా

NEWS DESK
1 Min Read

మైలేజ్‌లో స్వల్ప తేడా ఉండొచ్చని స్పష్టీకరణ

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై చర్చ కొనసాగుతున్న వేళ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా కీలక స్పష్టీకరణ ఇచ్చింది. తమ పెట్రోల్ వాహనాల్లో E20 ఇంధనాన్ని సురక్షితంగా వినియోగించవచ్చని కంపెనీ తెలిపింది. పాత మోడళ్లకు కూడా ఎలాంటి ఇంజిన్ నష్టం ఉండదని స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో ఓ వినియోగదారు అడిగిన ప్రశ్నకు స్పందించిన మహీంద్రా, ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంధన ప్రమాణాలకు అనుగుణంగానే తమ పెట్రోల్ ఇంజిన్లను రూపొందించామని పేర్కొంది. అన్ని మహీంద్రా పెట్రోల్ వాహనాలు E20 పెట్రోల్‌తో సురక్షితంగా నడుస్తాయని వెల్లడించింది.

అయితే 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త వాహనాలను E20 ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా క్యాలిబ్రేట్ చేసినట్లు తెలిపింది. ఈ వాహనాల్లో యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యం మరింత మెరుగ్గా ఉండేలా సాంకేతిక మార్పులు చేసినట్లు పేర్కొంది.

అంతకుముందు తయారైన పెట్రోల్ వాహనాలు కూడా E20తో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయని మహీంద్రా స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్ విధానం, రహదారి పరిస్థితులు, ట్రాఫిక్ వంటి అంశాల ఆధారంగా మైలేజ్ లేదా యాక్సిలరేషన్‌లో స్వల్ప మార్పులు కనిపించే అవకాశం ఉందని తెలిపింది.

ఇటీవల E20 పెట్రోల్ వాడితే పాత వాహనాల ఇంజిన్లకు నష్టం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఆందోళనలను తగ్గించేందుకే మహీంద్రా ఈ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో టయోటా, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ సంస్థల ప్రతినిధులు కూడా E20 ఇంధనం వాహనాలకు సురక్షితమేనని పేర్కొన్నారు. మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని, అయితే ఇంజిన్‌కు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article