అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల విద్యార్థి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లగా దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ఫిలడెల్ఫియాలో జరిగింది.
ఫిలడెల్ఫియా పోలీసుల వివరాల ప్రకారం, రేమండ్ రోసెన్ హోమ్స్ సముదాయంలోని ఎడ్జ్లీ స్ట్రీట్‌లో ఉన్న ఖాళీ అపార్ట్‌మెంట్‌కు మూడు పిజ్జాలు డెలివరీ చేయాలని ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్‌ను అందించేందుకు వెళ్లిన యువకుడిని దుండగులు ముందుగానే ఉచ్చులోకి లాగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

రాత్రి 12:30 గంటల సమయంలో కాల్పుల శబ్దాలు వినిపించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తల వెనుక భాగంలో బుల్లెట్ గాయం అయిన యువకుడిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఘటన స్థలంలో మూడు ఖాళీ బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి మృతదేహానికి అతి సమీపంలో లభించడంతో నిందితులు బాధితుడికి చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, బాధితుడు తన వాహనం నుంచి దిగిన తర్వాత నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు అతడిని వెంబడించినట్లు గుర్తించారు. ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్‌కు పిజ్జా ఆర్డర్ ఇచ్చి యువకుడిని అక్కడికి రప్పించి దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.