హిందూ ధర్మం (సనాతన ధర్మం) లో ప్రతి వస్తువును భగవత్స్వరూపంగా భావిస్తారు. ఆ కోవలోనే చీపురును కూడా లక్ష్మీదేవి స్వరూపంగా గౌరవిస్తారు. చీపురు కేవలం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడే వస్తువు మాత్రమే కాదు, ఇంటి ఆరోగ్యాన్ని, శుభ్రతను కాపాడే ఒక ముఖ్యమైన సాధనం. చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా చీపురు మనకు ఎంతో సేవ చేస్తుంది. అందుకే దీనిని అగౌరవపరచకూడదని పెద్దలు చెబుతారు. చీపురును పొరపాటున కూడా కాలితో తన్నకూడదు లేదా దానిపై కాలు వేయకూడదు. ఇది శనైశ్చరుడి ఆయుధాల్లో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది.. కాబట్టి, దాని పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

చీపురును ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా శుభాలు కలుగుతాయని నమ్ముతారు. చీపురును ఆగ్నేయ మూలలో ఉంచడం శ్రేష్ఠమని పండితులు సూచిస్తారు. ఈశాన్య మూలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును పెట్టకూడదు. అలాగే, చీపురును నిలబెట్టే పద్ధతి కూడా ముఖ్యమైనది. చాలామంది చీపురు కుచ్చు నేలవైపు ఉండేలా, పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెడతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెట్టాలి. కుచ్చు నేలవైపు ఉండటం వల్ల అది త్వరగా విరిగిపోవడం, వంగిపోవడం, ఎక్కువ కాలం పని చేయకపోవడం జరుగుతుంది. అందుకే, పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెట్టడం లేదా గోడకు తగిలించడం మంచిది.
పల్లెటూళ్లలో పూర్వకాలంలో కొబ్బరి చీపురులు, తాటిమట్టల చీపురులు వాడుకలో ఉండేవి. ఈ చీపురులను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేసేవారు. వాటిని తగిలించుకోవడానికి వీలుగా పైన ఒక హోల్డర్ లాంటిది ఉండేది. అవి దెబ్బతినకుండా ఉండేవి. ప్రస్తుతం వాడుకలో ఉన్న కొండ చీపురులు, మెత్తని చీపురులు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని తగిలించడం ఉత్తమం. బొంబాయి వంటి ప్రదేశాలలో చాలామంది చీపురును తగిలించుకోవడానికి హుక్‌లను అమర్చుకుంటారు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే కొన్ని ఆధునిక చీపురులకు తాడు కట్టడానికి లేదా హుక్‌లకు తగిలించడానికి వీలుగా ప్లాస్టిక్ హోల్డర్లు, రంధ్రాలు వస్తున్నాయి. దీని వల్ల చీపురు పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుంది.