తెలంగాణలో ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం: సీఈఓ సుదర్శన్‌రెడ్డి

NEWS DESK
1 Min Read

హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు నిలిపివేశారంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని వెల్లడించారు. ప్రజలు జూలై 25లోపు ఆ ఫారాలను సమర్పించాలని సూచించారు. ఇదే ఫారం ద్వారా కొత్త ఓటర్లు కూడా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే 80 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన పలు గుర్తింపు పత్రాలను కూడా ఆధారాలుగా పరిగణిస్తామని చెప్పారు. 2002కు ముందు ఓటరు జాబితాలో నమోదైన వారితో అనుసంధానం ఉన్న వ్యక్తులకు అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఇప్పటికే సమగ్ర శిక్షణ ఇచ్చామని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. బీఎల్‌వోలు సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు.

అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేసే వరకు ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని సీఈఓ స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.

📄 Generate e-Paper Clip
Share This Article