నా మాట ఎవరూ వినట్లేదు” – అధికారులపై సీఎం రేవంత్ అసహనం

NEWS DESK
1 Min Read

హైదరాబాద్‌లో వర్షాకాల సన్నద్ధతపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 9న కురిసిన వర్షాల సమయంలో మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

వర్షాలపై ముందుగానే హెచ్చరికలు వచ్చినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను సూచనలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవు” అని వ్యాఖ్యానించారు.

భారీ వర్షాల సమయంలో అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు, నీటిమునిగిన రహదారులు, విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల విద్యుదాఘాతంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

వ్యవసాయ సీజన్ నేపథ్యంలో విత్తనాలు, యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

📄 Generate e-Paper Clip
Share This Article