టీవీ షోలో అవకాశం పేరుతో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అనుమానితులు అదుపులో

NEWS DESK
1 Min Read

హైదరాబాద్‌లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని నమ్మబలికి ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకోగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 43 ఏళ్ల మహిళ కుటుంబ సమస్యల నేపథ్యంలో గత రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ తన ఏడేళ్ల కుమారుడితో జీవిస్తోంది. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ఒక టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆమె హైదరాబాద్‌కు వచ్చింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకుని, టీవీ షో నిర్వాహకులతో తనకు పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. అనంతరం రాణిగంజ్‌లోని ఓ నిర్మానుష్య భవనానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత మరో వ్యక్తి అక్కడికి చేరుకుని కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆమె మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

📄 Generate e-Paper Clip
Share This Article