ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ ఘాటైన సమాధానం ఇచ్చింది. నరమేధాలకు కారణమైన చరిత్ర ఉన్న దేశం భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం హాస్యాస్పదమని భారత్ తీవ్రంగా విమర్శించింది. ‘సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణ’ అంశంపై జరిగిన చర్చను పాకిస్థాన్ రాజకీయ వేదికగా మార్చే ప్రయత్నం చేయగా భారత్ గట్టిగా తిప్పికొట్టింది.
జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్
భద్రతా మండలిలో పాకిస్థాన్ ప్రతినిధి ఉద్దేశపూర్వకంగా జమ్మూ కశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అంతర్జాతీయ చట్టాలు, నైతిక విలువల పేరుతో భారత్‌పై విమర్శలు చేయడానికి ప్రయత్నించారు. సాయుధ ఘర్షణల అంశాన్ని అడ్డంగా పెట్టుకుని భారత అంతర్గత విషయాలను ప్రపంచ వేదికపైకి తీసుకురావాలని యత్నించారు.

భారత్ ఘాటు స్పందన
దీనిపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని తీవ్రంగా స్పందించారు. తమ దేశంలో ఉన్న వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ ఇతర దేశాలపై హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, అందులో పాకిస్థాన్ జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆఫ్ఘనిస్థాన్ ఘటనను గుర్తుచేసిన భారత్
ఈ ఏడాది మార్చిలో రంజాన్ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ ప్రస్తావించింది. కాబూల్‌లోని ఆసుపత్రిపై జరిగిన దాడిలో 269 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రార్థనలు ముగించుకుని వస్తున్న అమాయకులను లక్ష్యంగా చేసుకోవడం పాకిస్థాన్ వైఖరికి నిదర్శనమని విమర్శించింది.
1971 ఘటనలను ప్రస్తావించిన భారత్
1971లో ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ పేరుతో పాకిస్థాన్ సైన్యం సొంత ప్రజలపై అణచివేతకు పాల్పడిందని భారత్ గుర్తుచేసింది. లక్షలాది మహిళలపై దారుణాలు జరిగాయని ఆరోపించింది. సొంత ప్రజలపైనే దాడులు చేసిన దేశం అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని భారత్ వ్యాఖ్యానించింది.