మేడ్చల్ లో విల్లాల పేరుతో భారీ కుంభకోణం

NEWS DESK
3 Min Read
  • కస్టమర్ల ఆస్తులపై సాకేత్ ఇంజనీర్స్ సీక్రెట్ లోన్లు!
  • అమ్మేసిన విల్లాలను తనఖా పెట్టి కోట్లాది రూపాయల రుణం
  • మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు

నేటి ప్రస్థానం నిఘా విభాగం :
సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనుకున్న సామాన్యుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని, రియల్ ఎస్టేట్ రంగంలో సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ అక్రమాలకు పాల్పడినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయి, కస్టమర్ల ఆధీనంలో ఉన్న విల్లాలను, వారి అనుమతి లేకుండానే బ్యాంకుల వద్ద కుదువ పెట్టి కోట్లాది రూపాయల రుణాలు పొందినట్లు సాక్ష్యాధారాలతో సహా బయటపడింది.

విల్లాలను తాకట్టు పెట్టి సాకేత్ యాజమాన్యం :
మేడ్చల్ పరిధిలోని సాకేత్ భూ: సత్త్వ ప్రాజెక్టులో విల్లాలు కొనుగోలు చేసిన బాధితులు తమ ఆస్తుల ఈసీ పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. విస్ట్రా ఐటిసిఎల్ పేరుతో అక్టోబర్ 16, 2025న భారీ మొత్తంలో లోన్ తీసుకున్నట్లు రికార్డుల్లో ఉంది. అంటే, ఒకరికి అమ్మేసిన ఆస్తిని, తమదేనని నమ్మబలుకుతూ మరొక సంస్థ వద్ద తాకట్టు పెట్టి సాకేత్ యాజమాన్యం నిధులు మళ్లించింది.

మేనేజింగ్ డైరెక్టర్ టి. రాధాకృష్ణపై విచారణ :
బాధితురాలు అనిత విట్టల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు సాకేత్ ఇంజనీర్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. సంస్థ కార్యకలాపాలకు టి. రాధాకృష్ణ (మేనేజింగ్ డైరెక్టర్) బాధ్యుడిగా ఉంటూ ఈ మోసపూరిత పత్రాలపై సంతకాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కుట్రలో భాగస్వాములైన యాజమాన్య సభ్యులు, వారికి సహకరించిన సంస్థలు విస్ట్రా ఐటిసిఎల్ వంటి సంస్థల పాత్రపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తప్పుడు ధృవీకరణ పత్రాలను చూపి లోన్లు :
కస్టమర్ల నుండి పూర్తి డబ్బు వసూలు చేసి సేల్ డీడ్ ఇచ్చాక కూడ ఆ విల్లాల ఒరిజినల్ పత్రాలను లేదా తప్పుడు ధృవీకరణ పత్రాలను చూపి లోన్లు పొందారు. బాధితులకు తెలియకుండానే ‘మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్’ ద్వారా అక్రమ మార్టిగేజ్ చేసి ఆస్తులను బ్యాంకుల పరం చేశారు. రేరా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్ట్ పూర్తయిందని ఒకవైపు చెబుతూనే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల ఆస్తులపై అప్పులు తీసుకోవడం చట్టవిరుద్ధమని బాధితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అప్పు తీర్చకపోతే మా ఇళ్లు వేలం వేస్తారా ? :
మేము కష్టపడి సంపాదించిన డబ్బుతో విల్లా కొనుక్కుంటే, మాకు తెలియకుండానే మా ఇంటిపై అప్పు ఎలా ఇస్తారు ? రేపు సాకేత్ సంస్థ అప్పు తీర్చకపోతే మా ఇళ్లు వేలం వేస్తారా ? అని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాధితుల సంఘం రేరా మెట్లెక్కినప్పటికీ, సాకేత్ యాజమాన్యం టెక్నికల్ కారణాలు చెబుతూ తప్పించుకోవాలని చూస్తోందని వారు మండిపడుతున్నారు.

సాకేత్ యాజమాన్యంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి :
మేడ్చల్ పోలీసులు నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 316(2), 318(4) మరియు 3(5) కింద కేసులు నమోదు చేశారు. మోసం చేయడం, నమ్మక ద్రోహం మరియు ఉమ్మడి కుట్ర కింద విచారణ వేగవంతం చేశారు. పేరున్న సంస్థ కదా అని నమ్మి కోట్లు వెచ్చించి ఇళ్లు కొన్న ప్రజలు ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడ్డారు. సాకేత్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ ఆస్తులను తాకట్టు నుండి విడిపించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article