మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి స్వర్ణలత వ్యవహార శైలిపై పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరికి ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.
జిల్లాలో ఇప్పటికే మంజూరైన అక్రిడిటేషన్లను సంబంధిత జర్నలిస్టులకు అందజేయడంలో జాప్యం జరుగుతోందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు బస్సు పాసుల అప్రూవల్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 252 ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసినప్పటికీ, వాటిని పంపిణీ చేయడంలో చిన్నచిన్న కారణాలు చూపుతూ డీపీఆర్‌ఓ అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని ఆన్-ఎంప్యానల్ పత్రికల కార్యాలయాలకు ప్రైవేట్ వ్యక్తులను పంపించి విచారణ చేయించడంపై కూడా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు జర్నలిస్టు నాయకులు తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్లు అందేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు మెరుగు చంద్రమోహన్, బెలిదే అశోక్ గుప్తా, ముత్యం ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.