విజయవాడలో తీవ్ర సంచలనం రేపిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీ విచారణకు సంబంధించి హైకోర్టు విధించిన కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు విధించిన షరతులు దర్యాప్తు స్వేచ్ఛకు ఆటంకంగా మారుతున్నాయని, ముఖ్యంగా నిందితుడిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలన్న ఆదేశం దర్యాప్తు గోప్యతను దెబ్బతీసే అవకాశముందని సిట్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఇలాంటి నిఘా వల్ల విచారణ వ్యూహాలు బయటపడే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా, కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణ, సాయికృష్ణ మృతదేహం అన్వేషణ, సంఘటన స్థల పునర్నిర్మాణం (సీన్ రీకన్‌స్ట్రక్షన్) వంటి ప్రక్రియలు వేగంగా పూర్తి చేయాలంటే హైకోర్టు విధించిన నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
కఠినమైన షరతులు లేకుండా నిందితుడిని పూర్తిస్థాయిలో కస్టడీలో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో సిట్ దాఖలు చేసిన పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉండగా, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం దర్యాప్తు దిశను ప్రభావితం చేసే అవకాశముంది