కాళేశ్వరం నీళ్ల కోసం BRSV రక్తదానం.. సీఎం రేవంత్‌కు వినూత్న నిరసన

NEWS DESK
1 Min Read

BRSV నిరసన: ‘మా రక్తం తీసుకో.. రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వు’ అంటూ రేవంత్ రెడ్డికి వినూత్న నిరసన

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (BRSV) సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వినూత్న నిరసన చేపట్టింది. “రేవంత్ రెడ్డి.. ఇదిగో మా రక్తం తీసుకో.. రైతన్నలకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వు” అనే నినాదాలతో నాయకులు, కార్యకర్తలు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా BRSV రాష్ట్ర నాయకుడు నెమ్మాది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో 1,200 మందికి పైగా అమరుల త్యాగాల తర్వాతే రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. రైతులకు తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఒక పిల్లర్ కుంగి చాలా కాలం గడిచినా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకుండా రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించి రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన శ్రావణ్ కుమార్, రాష్ట్రంలో భూముల వ్యవహారాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించారు. రైతులు నీళ్లు అడిగితే రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

“నీకు ఎంత రక్తం కావాలంటే అంత ఇస్తాం.. కానీ రైతన్నలకు కాళేశ్వరం నీళ్లు మాత్రం విడుదల చేయండి” అంటూ రక్తదాన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ సందేశాన్ని తెలియజేశామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో BRSV, BRS యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతుల ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

📄 Generate e-Paper Clip
Share This Article