మేడ్చల్, జూలై 20:
మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 298 డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో దెబ్బతిన్న రహదారులు, వర్షపు నీటి నిల్వలపై BRS నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నిలిచిన వర్షపు నీటిలో వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ, మేడ్చల్ మున్సిపాలిటీని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసినప్పటికీ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆరోపించారు. రహదారుల దుస్థితి కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, పదికి పైగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన మార్గం ఇదేనని, ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఇదే రహదారిని ఉపయోగిస్తున్నప్పటికీ దాని మరమ్మతులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అలాగే, పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండటంతో చిన్నారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రహదారుల మరమ్మతులు చేపట్టి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
నిరసన సందర్భంగా BRS కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.