భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ఉదయం నాటికి గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరగా, దాదాపు 9.75 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
వరద ప్రభావంతో భద్రాచలం కళ్యాణకట్ట, స్నాన ఘట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. గోదావరి ఒడ్డునకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ వరద జలాలతో కళకళలాడుతున్నాయి. శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, జూరాల ప్రాజెక్టులు దాదాపు నిండగా, కాళేశ్వరం వద్ద కూడా గోదావరి ప్రమాద స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.