గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తైనప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇళ్లలో నివాసం ఉండకపోవడం, మరికొన్ని గృహ సముదాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కొత్త అర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి సుమారు 15 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఖాళీగా లేదా కేటాయింపులకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా గృహ సముదాయాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అర్హుల ఎంపిక కోసం రెవెన్యూ, హౌసింగ్ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నాయి. సొంత ఇల్లు లేకపోవడం, గతంలో ప్రభుత్వ గృహ పథకాల కింద ఇల్లు పొందకపోవడం వంటి అంశాలను ప్రధాన అర్హత ప్రమాణాలుగా పరిగణించనున్నారు. అలాగే ఇప్పటికే ఉన్న ఎల్-2 జాబితాలోని అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు, డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరైనప్పటికీ అందులో నివాసం ఉండని లబ్ధిదారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇళ్లను ఖాళీగా ఉంచిన వారికి తుది నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దేశిత గడువులోగా స్పందించని వారి కేటాయింపులను రద్దు చేసి, ఆ ఇళ్లను కొత్త అర్హులకు కేటాయించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
ఇదిలా ఉండగా, మేడ్చల్ జిల్లాలోని గండిమైసమ్మ, దుండిగల్ ఫేజ్-2 ప్రాంతాల్లో కొనసాగుతున్న గృహ నిర్మాణ పనులను హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న 6 వేలకుపైగా ఇళ్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.