జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న 480 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఈ ఖాతాలకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
నిరసనలకు సంబంధించి కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందించిన వీడియోలు, డీప్‌ఫేక్‌లు, ఎడిట్ చేసిన వీడియో క్లిప్పింగ్‌లు, నకిలీ పోస్టుల ద్వారా ప్రణాళికాబద్ధమైన దుష్ప్రచారం జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ వీడియోలు, డీప్‌ఫేక్‌లు, ఇతర తప్పుడు పోస్టుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా పోస్ట్, వీడియో లేదా ఫొటోను నమ్మే ముందు, ఇతరులకు షేర్ చేసే ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందంటూ విపక్ష నాయకులు చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టం చేశారు.