కర్ణాటక కాలేజీల్లో HIV కలకలం.. 7 వేల మందికి పైగా విద్యార్థులకు పాజిటివ్

NEWS DESK
1 Min Read

కర్ణాటకలో హెచ్‌ఐవీ (HIV) కేసులకు సంబంధించిన తాజా గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో నమోదైన మొత్తం HIV బాధితుల సంఖ్య సుమారు 2.60 లక్షలు. వీరిలో 2.05 లక్షల మంది మాత్రమే చికిత్స పొందుతుండగా, మరో 54 వేల మందికి తమకు HIV ఉన్న విషయమే తెలియదని అంచనా వేస్తున్నారు.

అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, మొత్తం బాధితుల్లో 7 వేల మందికిపైగా కాలేజీ విద్యార్థులు ఉండడం. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులేనని నివేదిక వెల్లడించింది.

18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో HIV కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2023-24లో ఈ వయసు గల బాధితుల సంఖ్య సుమారు 44,500 ఉండగా, 2025-26 నాటికి అది 66 వేల వరకు పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో భారీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అన్ని కాలేజీల్లో HIV కౌన్సెలింగ్ క్యాంపులు, పరీక్షా శిబిరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే పరీక్షలు పూర్తిగా స్వచ్ఛందంగా మాత్రమే నిర్వహిస్తామని, విద్యార్థుల అంగీకారం లేకుండా ఎలాంటి స్క్రీనింగ్ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది.

విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక QR కోడ్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. దీనిని స్కాన్ చేస్తే సమీప HIV కేంద్రాలు, పరీక్షలు, చికిత్స, నివారణకు సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో ఉంటుంది.

📄 Generate e-Paper Clip
Share This Article