తెలంగాణ జాగృతి సంస్థలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సంస్థకు నాయకత్వం వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇకపై ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతలను మారిపల్లి మాధవికి అప్పగిస్తూ కవిత సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి కార్యకలాపాలను మరింత విస్తరించడంతో పాటు సంస్థను కొత్త దశలోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్త నాయకత్వంలో తెలంగాణ జాగృతి మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
2006లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సాంస్కృతిక బలం చేకూర్చేందుకు జాగృతిని స్థాపించినట్లు కవిత గుర్తు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు.

బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో తెలంగాణ జాగృతి విశేష కృషి చేసిందని కవిత పేర్కొన్నారు. మహిళలను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో కూడా సంస్థ కీలక పాత్ర పోషించిందని తెలిపారు.