తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. “విజయ్ సీఎం అవుతారా?” అనే ప్రశ్న ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 11 సీట్ల దూరంలో నిలిచిపోయిన టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆ మద్దతు ఎవరి నుంచి లభిస్తుందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇదే సమయంలో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ టీవీకే వాదనలతో పూర్తిగా కన్విన్స్ కాలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం.

వాస్తవానికి టీవీకే అధినేత విజయ్ రేపే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. కానీ గవర్నర్ నుంచి అధికారిక అనుమతి రాకపోవడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పార్టీ ఎమ్మెల్యేలు రిసార్ట్‌లోనే ఉండాలని విజయ్ సూచించినట్లు సమాచారం.
ఈ పరిణామాల మధ్య తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక చేతులు కలిపే ప్రయత్నాలు చేస్తున్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం డీఎంకే ఖాతాలో 59 మంది సభ్యులు ఉండగా, అన్నాడీఎంకేకు 47 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పక్కన పెడితే, ఈ రెండు పార్టీల మిత్రపక్షాల మద్దతుతో సభ్యుల సంఖ్య 120కు చేరుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ ఇంకా స్పష్టమైన మెజార్టీని నిరూపించకపోవడం వల్లే ద్రవిడ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
ఇదిలా ఉంటే, టీవీకేకు వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తాయనే ప్రచారం కూడా సాగింది. అయితే దీనిపై సీపీఐ, సీపీఎం పార్టీలు స్పష్టత ఇచ్చాయి. డీఎంకేతో ఉన్న పొత్తు ధర్మాన్ని వదిలిపెట్టబోమని, టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రకటించాయి. మరోవైపు ఐయూఎంఎల్, వీసీకే వంటి పార్టీల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.
మొత్తంగా తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరిత మలుపు తిరుగుతున్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? లేక ద్రవిడ పార్టీల కొత్త రాజకీయ సమీకరణాలు రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తాయా? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.