హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగిని టార్గెట్ చేస్తూ ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్న ఓ వివాహిత, ఆ తరువాత వ్యక్తిగత క్షణాలను ఆయుధంగా మార్చి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు వేధింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాలానగర్ గాంధీనగర్‌కు చెందిన టి. సాయికిరణ్ (29) ఖైరతాబాద్‌లోని సివిల్ సప్లయి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 2022లో రేషన్ కార్డులో తన కుమారుడి పేరు సరిచేసుకునేందుకు ఓ వివాహిత కార్యాలయానికి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
తాను సైదాబాద్‌లో కొడుకుతో ఒంటరిగా ఉంటున్నానని, భర్త దూర ప్రాంతంలో ఉంటాడని చెప్పి ఆమె సాయికిరణ్‌తో మరింత దగ్గరైంది. ఫోన్ నంబర్లు మార్చుకొని తరచూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం రెస్టారెంట్లు, ఓయో హోటళ్లకు కలిసి వెళ్లినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఇద్దరూ కలిసి గడిపిన వ్యక్తిగత క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, హోటల్ రశీదులు సేకరించిన మహిళ.. వాటిని ఆధారంగా చేసుకొని డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వేధింపులు పెరగడంతో సాయికిరణ్ తీవ్ర మనస్తాపానికి గురై 2023లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని మహిళను నిలదీయగా, అక్కడ కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటీవల మరోసారి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పాటు, ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించిందని బాధితుడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.