భర్త కంటే ఎక్కువ జీతం.. భార్యకు భరణం నిరాకరించిన బాంబే హైకోర్టు

NEWS DESK
2 Min Read

ముంబై: భర్త కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్న భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. విదేశాల్లో జీవన వ్యయం అధికంగా ఉందనే కారణంతో భరణం కోరడం సమంజసం కాదని పేర్కొంది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతోందని, భర్త ఉద్యోగానికి కూడా ముప్పు ఉండొచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ఓ మహిళ.. తన భర్త నుంచి నెలకు రూ.లక్ష భరణంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. న్యూఢిల్లీలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఆమె నెలకు సుమారు రూ.8 లక్షలు సంపాదిస్తున్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఆమె భర్త కూడా ఐటీ రంగంలోనే పనిచేస్తున్నారు. అయితే తన భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ.. న్యూజెర్సీలో జీవన వ్యయం అధికంగా ఉందని, అందువల్ల భరణం మంజూరు చేయాలని ఆమె కోరారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ భారతీ డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం విచారించింది. విదేశాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉందనే కారణంతో భర్త నుంచి భరణం కోరడం సమర్థనీయం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ఐటీ రంగంలో పెరుగుతున్న పోటీ, ఏఐ వినియోగం వంటి పరిణామాల నేపథ్యంలో భర్త ఉద్యోగ భద్రతకు కూడా ముప్పు ఉండవచ్చని ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసులో గతంలో ఫ్యామిలీ కోర్టు కూడా మహిళ భరణం అభ్యర్థనను తిరస్కరించింది. అయితే కేసు విచారణ ఖర్చుల కింద రూ.25,000 చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టులోనూ ఆమెకు నిరాశే ఎదురైంది.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద బిడ్డ తండ్రి వద్ద, చిన్న బిడ్డ తల్లి వద్ద ఉంటున్నట్లు విచారణ సందర్భంగా వెల్లడైంది. భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువగా ఉండటం, విదేశాల్లో అధిక జీవన వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. భరణం మంజూరు చేయడానికి నిరాకరించింది.

📄 Generate e-Paper Clip
Share This Article