అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. టెక్సాస్‌లోని బోకా చిగా స్టార్‌బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన స్టార్‌షిప్ ఫ్లైట్-13 విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. భవిష్యత్తులో మానవులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేందుకు పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న స్పేస్‌ఎక్స్‌కు ఈ ప్రయోగం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
శనివారం ఉదయం ప్రయోగించిన ఈ భారీ రాకెట్ నిర్ణీత ప్రణాళిక ప్రకారం అంతరిక్షంలోకి చేరుకుంది. ప్రయోగం ప్రారంభమైన సుమారు రెండు నిమిషాల తర్వాత ప్రధాన రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయింది. అయితే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ కావాల్సిన బూస్టర్-20 ఇంజిన్ స్టార్టింగ్‌లో తలెత్తిన సమస్యల కారణంగా నియంత్రణ కోల్పోయి సముద్రంలో దెబ్బతింది.

ఇక ప్రధాన వ్యోమనౌక స్టార్‌షిప్-40 మాత్రం తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. దాదాపు 20 నెక్స్ట్ జనరేషన్ స్టార్‌లింక్ వెర్షన్-3 ఇంటర్నెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. అనంతరం సుమారు గంటన్నర ప్రయాణం తర్వాత భూ వాతావరణంలోకి పునఃప్రవేశించిన స్టార్‌షిప్.. హిందూ మహాసముద్రంలో సురక్షితంగా సాఫ్ట్ స్ప్లాష్‌డౌన్ చేసింది.
స్టార్‌షిప్ వ్యోమనౌక సముద్రంలో విజయవంతంగా సాఫ్ట్ స్ప్లాష్‌డౌన్ చేయడం ఇదే తొలిసారి కావడంతో స్పేస్‌ఎక్స్ బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ విజయంపై సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కూడా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం భవిష్యత్తులో పునర్వినియోగ అంతరిక్ష ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిలో కీలక ముందడుగుగా నిలిచింది.