హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను నగదుగా మార్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఆరు నెలల పాటు దశలవారీగా భూముల వేలం నిర్వహించి రూ.12 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా జూన్ 17 నుంచి తొలి విడతలోనే సుమారు రూ.3 వేల కోట్ల విలువైన ప్లాట్లను విక్రయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
అయితే ప్రభుత్వ ఖజానా నింపేందుకు చేపడుతున్న ఈ వేగవంతమైన భూముల విక్రయ ప్రక్రియపై నగరవాసులు, పర్యావరణవేత్తలు, అర్బన్ ప్లానింగ్ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వ భూముల అమ్మకమే మార్గంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
భవిష్యత్ అవసరాలపై ప్రశ్నలు
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకు కీలకంగా మారుతున్నాయి. రేపటి రోజున ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బస్టాండ్లు, పార్కులు, క్రీడా మైదానాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో ప్రజా ఉపయోగాల కోసం కేటాయించిన భూములను కూడా వేలం వేయడం సమంజసమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హరితహారానికి ముప్పు?
పర్యావరణ పరిరక్షణ, అర్బన్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం నగరంలోని ఖాళీ స్థలాలు, గ్రీన్ కారిడార్లను రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వినియోగించడం విరుద్ధ ధోరణిగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. కోకాపేట, బుద్వేల్ వంటి అధిక విలువ గల ప్రాంతాలతో పాటు నగర శివార్లలోని లే అవుట్లను కూడా వేలానికి సిద్ధం చేయడం వెనుక ప్రధాన లక్ష్యం ఆదాయ సేకరణేనని వారు అభిప్రాయపడుతున్నారు.
సుస్థిర అభివృద్ధికి దెబ్బ?
తాత్కాలిక ఆర్థిక లాభాల కోసం ప్రభుత్వ భూములను విక్రయించడం వల్ల భవిష్యత్‌లో నగర ప్రణాళికాబద్ధ అభివృద్ధికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని అర్బన్ ప్లానింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, నగరానికి శాశ్వత ఆస్తిగా ఉండాల్సిన భూములు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే భవిష్యత్ తరాలు స్థలాభావం, పర్యావరణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

జూన్ 17 నుంచి వేలం ప్రారంభం
జూన్ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ వేలంలో హకీంపేట్ (8.24 ఎకరాలు), మోకీలా, మేడిపల్లి లే అవుట్, చందానగర్, బైరాగిగూడ, నార్సింగి, బౌరంపేట్, సూరారం, పీర్జాదిగూడ ప్రాంతాల్లోని భూములను విక్రయించనున్నారు.
ప్రత్యేకంగా షేక్‌పేట్ మండలంలోని హకీంపేట్ గ్రామ పరిధిలో ఉన్న 8.24 ఎకరాల భూమి విక్రయం ద్వారా దాదాపు రూ.1,500 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. జూన్ 30 వరకు కొనసాగే ఈ తొలి విడత వేలం ద్వారా మొత్తం రూ.3 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.