హైదరాబాద్‌లో రేపటి నుంచి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 26 నుంచి 31 వరకు నగరంలో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ నిపుణులు వివరాల ప్రకారం, ఈ నెలాఖరు వరకు నగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ విభాగం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనతో కూడిన ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే, రాబోయే నాలుగు రోజుల వరకు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా ఎలాంటి వర్ష హెచ్చరికలు ఇవ్వలేదు. జులై 26 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఆ తర్వాత అడపాదడపా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.