తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. ప్రాజెక్టుల్లో వినియోగానికి కేవలం 40 టీఎంసీలు.. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ప్రభుత్వం అలర్ట్

NEWS DESK
2 Min Read

తెలంగాణలో నీటి సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళిక తాజా పరిస్థితుల తీవ్రతను బయటపెట్టింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీని మినహాయిస్తే వినియోగానికి కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇదే నీటితో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, సింగరేణి అవసరాలను ప్రభుత్వం సమన్వయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జూలై మధ్యలోనే ఖాళీగా రిజర్వాయర్లు

సాధారణంగా జూలై మధ్య నాటికి రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు వరద జలాలతో నిండిపోతాయి. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షలోటు నమోదైంది. రాబోయే మూడు నెలలపాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.

కృష్ణా బేసిన్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరం

కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం వినియోగానికి కేవలం 12.88 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఇందులో నాగార్జునసాగర్‌లో 6.01 టీఎంసీలు, ఇతర మధ్యతరహా ప్రాజెక్టుల్లో 5.88 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

హైదరాబాద్‌తో పాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలు, నాగార్జునసాగర్ ఎడమ, కుడి కాలువల కింద లక్షల ఎకరాల సాగు ఈ నిల్వలపైనే ఆధారపడి ఉంది.

గోదావరిలో నిల్వలు ఎక్కువగా కనిపిస్తున్నా…

గోదావరి బేసిన్‌లో మొత్తం 66.50 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ, అందులో 37.21 టీఎంసీలు డెడ్ స్టోరేజీ కావడంతో వినియోగానికి కేవలం 29.30 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

శ్రీరాంసాగర్, నిజాంసాగర్, కడెం, మిడ్ మానేరు, లోయర్ మానేరు, సింగూరు, శ్రీపాద ఎల్లంపల్లి వంటి కీలక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరాయి.

వర్షలోటు మరింత పెరిగే సూచనలు

జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలో 228 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 158 మిల్లీమీటర్లే నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 శాతం వర్షలోటు నమోదైంది.

ప్రభుత్వ అంచనాల ప్రకారం..

  • ఆగస్టులో 15% వర్షలోటు
  • సెప్టెంబరులో 42%
  • అక్టోబరులో 55%

వరకు లోటు నమోదయ్యే అవకాశం ఉంది.

భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి

జూన్‌లో సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్ల లోతులో ఉండగా, జూలైలో అది 10.35 మీటర్లకు పడిపోయింది. ఆగస్టు నాటికి 11.01 మీటర్లకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

దీంతో బోర్లు ఎండిపోవడం, కొత్త బోర్లలో నీరు దొరకకపోవడం, సాగు ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ప్రభుత్వానికి భారీ సవాల్

నీటి కొరత కారణంగా రైతులు, పట్టణాలు, పరిశ్రమలు, విద్యుత్ రంగం, సింగరేణి సంస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూ సాగునీటి విడుదలను పరిమితం చేయాల్సిన పరిస్థితి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, పంటల ప్రణాళిక, నీటి పొదుపు చర్యలను అత్యవసరంగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

📄 Generate e-Paper Clip
Share This Article