గ్రాండ్యూర్ వెంచర్ సమస్యను వెంటనే పరిష్కరించాలి: బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని గ్రాండ్యూర్ వెంచర్‌ను ఇటీవల “ప్రొహిబిటెడ్” జాబితాలో చేర్చడంతో ప్లాట్ యజమానులు, గృహ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు ఆయన బుధవారం గ్రాండ్యూర్ వెంచర్‌ను సందర్శించి స్థానికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వెంచర్‌లోని ప్లాట్, ఇంటి యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి, అనంతరం మేడ్చల్ తహసీల్దార్‌ను కలిసి సమస్యపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

దశాబ్దాలుగా కష్టపడి సంపాదించిన సొమ్ముతో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు నేడు తమ ఆస్తుల భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు.

గ్రాండ్యూర్ వెంచర్ సమస్య కారణంగా వందలాది కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నాయని, వారి ఆస్తుల రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, ఇతర లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో వ్యవహరించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు శైలజా రినాథ్, జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాకట్ ప్రేమ్ దాస్, ఉపాధ్యక్షులు మైసర్ రాజు, కార్యదర్శి విష్ణుమూర్తి గౌడ్, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, సీహెచ్ శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బొజ్జ రాఘవ రెడ్డి, సీనియర్ నాయకులు బుజ్జా వంశీధర్ రెడ్డి, సీహెచ్ శ్రీపాల్ రెడ్డి, మహేష్ గౌలికర్‌తో పాటు ప్లాట్ యజమానులు శ్రీనివాస్, సంజయ్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article