కీసరలో భూ దందా కలకలం.. నకిలీ పత్రాలతో ఖాళీ ప్లాట్లపై కన్ను

NEWS DESK
2 Min Read

కీసర శివారు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలు, నకిలీ వ్యక్తులతో సాగుతున్న భూ కబ్జాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనలపై కీసర పోలీస్‌స్టేషన్‌లో వరుసగా కేసులు నమోదవుతుండగా, రోజుకో కొత్త ముఠా వ్యవహారం వెలుగులోకి వస్తోంది.

పోలీసుల దర్యాప్తులో ఈ అక్రమ భూ దందాకు అప్పటి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి సహకారం లభించినట్లు తేలినట్టు సమాచారం. సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులు ప్రభుత్వానికి లేఖ రాసి దాదాపు రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఇటీవల గుంజి చిరంజీవి నేతృత్వంలోని మరో ముఠాను కీసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుతో నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న మరిన్ని ముఠాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోనే ఇలాంటి భూ మోసాల కేసులు అధికంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో కేసు దర్యాప్తులో కొత్త ముఠా బయటపడుతున్నప్పటికీ, అసలు ఇలాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ప్లాట్లకు నకిలీ పత్రాలు రూపొందించారు? నకిలీ వ్యక్తులను ముందుంచి ఎన్ని అక్రమ క్రయవిక్రయాలు జరిపారు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సూత్రధారులను గుర్తించి అరెస్ట్ చేస్తే, అక్రమ రిజిస్ట్రేషన్ల పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ డేటాను విశ్లేషించి బాధితుల ప్లాట్లను గుర్తించి, వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించకుండా అక్కడికక్కడే వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

కొంతమంది అసలు ప్లాట్ల యజమానులు విదేశాల్లో ఉండటం, మరికొందరు వృద్ధులు కావడం వల్ల తమ ఆస్తులు ఇతరుల పేర్లపైకి మారిపోయిన విషయమే తెలియకపోవచ్చని స్థానికులు అంటున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్దిష్ట కాలంలో జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లను సమగ్రంగా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article