తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మొదలైన సవాళ్లు, ప్రతిసవాళ్లు చివరకు హైదరాబాద్ వీధుల్లో హైడ్రామాకు దారితీశాయి. తెలంగాణ భవన్, గన్ పార్క్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, భారీగా పోలీసులు మోహరించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌తో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఆ సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరిస్తూ, “వరంగల్ అయినా, హైదరాబాద్ అయినా… ఎక్కడైనా చర్చకు సిద్ధమే” అంటూ ప్రతిసవాల్ విసిరారు.
దీనికి ప్రతిస్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, “కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ అవసరం లేదు. నేనే వస్తా… ఉదయం 11 గంటలకు నేరుగా తెలంగాణ భవన్‌కు వస్తున్నా. కమాన్ కేటీఆర్… కాస్కో” అంటూ సవాల్ విసరడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, ఇతర కాంగ్రెస్ నేతలు గన్ పార్క్‌కు చేరుకుని తమ నిరసన కొనసాగించారు.

తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కిందపడగా, అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం గన్ పార్క్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం రోడ్లపై ఆందోళనలుగా మారడంతో రాజధాని హైదరాబాద్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్, గన్ పార్క్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
రాష్ట్ర అప్పులపై మొదలైన రాజకీయ సవాళ్లు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీయడంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.