రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి ఈ-క్యాబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!

NEWS DESK
2 Min Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (జులై 2) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలిసారిగా పూర్తిస్థాయి కాగితరహిత (ఈ-క్యాబినెట్) విధానంలో ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై అన్ని క్యాబినెట్ సమావేశాలను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను అందించారు. ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది.

ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ-రామ్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలా లేదా అనే అంశంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ పథకంలోని కొన్ని నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

వానాకాలం సాగు ఏర్పాట్లు, విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల వైవిధ్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే చర్యలతో పాటు ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానికత కలిగిన ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రతిపాదిత ఎస్ఐజీ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలు, నమూనా డిజైన్లు, అమలు విధివిధానాలకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

డిజిటల్ పాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న కీలక అడుగుగా భావిస్తున్న ఈ తొలి ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక విధాన నిర్ణయాలు వెలువడే అవకాశంతో రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

📄 Generate e-Paper Clip
Share This Article