మేడ్చల్, జూన్ 22: మేడ్చల్ పట్టణంలోని 297వ డివిజన్‌లో కటిక సాధుల్లా కిషన్ వంశీయులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న మొహర్రం (పీర్ల) పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ నాయకుడు రామన్న గారి రాఘవేంద్ర గౌడ్ పీర్ల దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
దర్గాకు విచ్చేసిన రాఘవేంద్ర గౌడ్‌కు నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పీర్లకు ప్రత్యేక పూజలు, దర్శనం చేసుకుని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా సోదరభావాన్ని పెంపొందించే గంగా-జమునా తెహజీబ్‌కు పీర్ల పండుగ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఈ పండుగను జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్, ప్రముఖ నాయకులు ప్రమోద్, కటిక వినయ్, శంకర్, రాము, జితేష్‌తో పాటు వంశ నిర్వాహకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొహర్రం వేడుకలు భక్తి, సామరస్య వాతావరణంలో కొనసాగుతున్నాయి.