నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ వచ్చిన పరిణామాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విద్యార్థుల విజయంగా అభివర్ణించింది. ఈ సందర్భంగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
సీజేపీ తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ.. తమ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని పేర్కొంది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో సాగించిన శాంతియుత పోరాటం ఫలించిందని, యువత ఉద్యమం విజయవంతమైందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు.
మంత్రి రాజీనామా వార్త వెలువడిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 6:30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

దేశ యువత చేపట్టిన శాంతియుత నిరసన వృథా కాలేదని, ఈ పోరాటం ద్వారా విద్యార్థుల సత్తా ఏమిటో నిరూపితమైందని సీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల విజయంగా అభివర్ణించారు.
తమ ఉద్యమానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన సీజేపీ.. తమ మూడు ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని, మిగిలిన రెండు డిమాండ్లు కూడా పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై దాడులకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.