తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఎండలతో పాటు వర్షాలు, ఈదురుగాలులు
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు మండుతుండగా, మరోవైపు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ విడుదల చేసింది.
నైరుతి రుతుపవనాలు జూన్ 11 నాటికి ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతోందని వెల్లడించారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో శుక్రవారం పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని తెలిపారు.
అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.
అయితే రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో రానున్న మూడు రోజుల పాటు పెద్దగా మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.