హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వరుసగా నమోదవుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ యగౌచ్ అహ్మద్ అనే వ్యక్తిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన స్క్రీనింగ్‌లో అతడిలో ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే వైద్య బృందాలు స్పందించి ప్రత్యేక పర్యవేక్షణలోకి తీసుకున్నాయి.
ఇప్పటికే కొద్ది రోజుల క్రితం సుడాన్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలో కూడా ఇలాంటి లక్షణాలు గుర్తించడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజా కేసుతో ఎబోలా అనుమానితుల సంఖ్య రెండుకు పెరిగింది.
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆరోగ్యశాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. అనుమానితుల నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు సమాచారం.