దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలపై నీట్-2026 పరీక్ష తీవ్ర ప్రభావం చూపింది. అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా ప్రభావం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వస్తున్న విమర్శల నడుమ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొల్పింది.

పరీక్ష కోసం నెలల తరబడి కష్టపడి సిద్ధమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా పరీక్ష రద్దు కావడంతో విద్యార్థుల శ్రమ వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్, ఏఐవైఎఫ్ సహా పలు విద్యార్థి, ప్రజా సంఘాలు బుధవారం నగరంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తూ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత లేకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు.
లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఉన్న నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.