రుతుపవనాల రాక ఆలస్యం.. వడగాల్పులతో తెలంగాణ విలవిల!

NEWS DESK
1 Min Read

దేశంలో నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మే చివరి వారంలో దేశంలోకి ప్రవేశించే రుతుపవనాలు, ఈసారి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జూన్ తొలి వారంలో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. వడగాల్పుల తీవ్రత మరింత పెరిగితే రుతుపవనాల రాక ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, రుతుపవనాల ఆలస్యంతో తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. మండుతున్న ఎండలు, వడగాల్పులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

సోమవారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై తీవ్ర వేడి పరిస్థితులను సూచించింది.

ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ మృతులు కూడా పెరుగుతున్నారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో 20 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది, కరీంనగర్ జిల్లాలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం.

ఒకవైపు ఎండలు భగ్గుమంటున్నప్పటికీ, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నల్లగొండ, వికారాబాద్‌, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

అదేవిధంగా, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణానికి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

📄 Generate e-Paper Clip
Share This Article