బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలు సుఖంగా జీవించారని, తమ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. పేదలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నా… జీవో 58, 59 ద్వారా రెండున్నర లక్షల మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నా హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. “హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే… నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా” అంటూ సవాల్ విసిరారు.
ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారని… ఇల్లు పోతుందనే భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇళ్లు కట్టింది కాంగ్రెస్ కాదని… కానీ వేలాది ఇళ్లు కూల్చిందని విమర్శించారు.

“గుంపు మేస్త్రీ అయితే ఇళ్లు కట్టాలి… కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు కూల్చుతున్నాడు” అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపిస్తూ… కల్యాణ లక్ష్మీ కింద కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే, కాంగ్రెస్ అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదన్నారు.
రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచలేదని, మహిళలకు హామీ ఇచ్చిన రూ.2500 కూడా అందలేదని ప్రశ్నించారు. ప్రతి వర్గానికీ కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ తాగునీరు అందించామని, 24 గంటల విద్యుత్ కూడా అందించామని కేటీఆర్ తెలిపారు. 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.