ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)పై రాజకీయ వివాదం నెలకొంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో సంబంధాలున్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ఆరోపించారు. బీజేపీ యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి తేజీందర్ బగ్గా, పార్టీ ప్రతినిధి ప్రీతి గాంధీ మాట్లాడుతూ.. సీజేపీ సోషల్ మీడియా ఫాలోవర్లలో ఎక్కువ మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికాకు చెందినవారేనని, భారతీయులు కేవలం 9 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన డేటాను కూడా బగ్గా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అయితే ఈ ఆరోపణలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా ఖండించారు. తన ఇన్‌స్టాగ్రామ్ అనలిటిక్స్ వివరాలను విడుదల చేస్తూ.. తమ ఫాలోవర్లలో 94 శాతం మంది భారతీయులేనని స్పష్టం చేశారు. తమ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నించి విఫలమైన వ్యక్తులే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారింది.