బండి భగీరథ్ అరెస్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భగీరథ్ లొంగిపోయాడని బండి సంజయ్ చెబుతుంటే, పోలీసులు అరెస్టు చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఇద్దరూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేసిన కేటీఆర్, ఆయనకు ఎత్తు మాత్రమే కాదు, ఆలోచనా విధానంలో కూడా లోపాలున్నాయని ఎద్దేవా చేశారు.
భగీరథ్‌కు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ, హైకోర్టులో అనుకూల తీర్పు రాలేదని కేటీఆర్ తెలిపారు. ఓ యువతికి అన్యాయం జరిగిన ఘటనలో ఆమె వ్యక్తిగత వివరాలను బయటపెట్టింది బీజేపీ నేతలేనని ఆరోపించారు. పేట్ బషీరాబాద్‌లో నమోదైన కేసుల్లో 15 మంది బీజేపీ కార్యకర్తల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ పర్యటనలో ప్రజలకు నిరాశ కలిగించే వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ విమర్శించారు. రైతులు యూరియా వినియోగం తగ్గించాలని, ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు నెలకొన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగినంతకాలం రైతులకు కష్టాలు తప్పవని అన్నారు.
రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదని, కానీ గన్‌లు మాత్రం సులభంగా లభిస్తున్నాయని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.