మధ్యతరగతి కలలకు రెక్కలు.. తెలుగురాష్ట్రాల్లో ఎయిర్‌పోర్టుల మేళా!

NEWS DESK
2 Min Read

విమాన ప్రయాణం కేవలం బిగ్‌షాట్‌లకే పరిమితం కాకూడదు.. మధ్యతరగతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలన్నది ఓ వ్యక్తి కల. ఫ్లైట్‌ ఎక్కి ఆకాశంలో ఎగరాలన్న ఆశ ప్రతి ఒక్కరికీ ఉండొచ్చు. ఆ కలను సామాన్యుడి హక్కుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వాలతో పోరాడి, కార్పొరేట్‌ శక్తులతో తలపడి ‘ఎయిర్‌ డెక్కన్‌’కు పునాది వేశారు కెప్టెన్‌ జి.ఆర్. గోపీనాథ్‌.

పెద్దోడు, పేదోడు.. బిజినెస్‌ క్లాస్‌, ఎకానమీ క్లాస్‌ అంటూ తేడాలు ఉన్నా.. కనీసం విమానం ఎక్కే అవకాశం మాత్రం అందరికీ దక్కాలన్న ఆయన ఆలోచన క్రమంగా సాకారమైంది. తక్కువ ధరలో విమాన ప్రయాణం అనే కాన్సెప్ట్‌ ఇప్పుడు సామాన్యుడికి కూడా చేరువవుతోంది. ఎయిర్‌లైన్స్‌ సంస్థల మధ్య పోటీ పెరగడంతో కొన్ని రూట్లలో విమాన టికెట్‌ ధరలు రైలు ప్రయాణ ఖర్చులకు దగ్గరగా వస్తున్నాయి.

అయితే విమాన ప్రయాణం చౌకగా మారినా.. విమానాలు ఎక్కడి నుంచి ఎగరాలి? ఎక్కడ దిగాలి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలి. ఒకప్పుడు దేశంలో విమానాశ్రయాల కొరత అతిపెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

తెలుగురాష్ట్రాల్లో ఎయిర్‌పోర్టుల మేళా!

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల విస్తరణకు కొత్త ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది. భోగాపురం నుంచి మామునూరు వరకు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం, ప్రతిపాదనలు వేగం పుంజుకుంటున్నాయి. ప్రతి రెండు జిల్లాలకు ఒక విమానాశ్రయం ఉండేలా కనెక్టివిటీని పెంచాలన్న ఆలోచనకు ప్రాధాన్యం పెరుగుతోంది.

కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏవియేషన్‌ రంగంపై మరింత దృష్టి పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పౌర విమానయాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత విమానాశ్రయాల అభివృద్ధి, ప్రాంతీయ కనెక్టివిటీపై చర్చ మరింత ఊపందుకుంది.

ఫస్ట్ మెగా టేకాఫ్‌.. భోగాపురం!

తెలుగు రాష్ట్రాల ఏవియేషన్‌ విస్తరణలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవనుంది. ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్మితమవుతోంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఊతం లభించే అవకాశం ఉంది. పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలు, ఉద్యోగాల రంగాల్లో కొత్త అవకాశాలకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నారు.

ఇక తెలంగాణలోనూ మామునూరు విమానాశ్రయం సహా కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై ఆసక్తి పెరుగుతోంది. ప్రాంతీయ విమాన కనెక్టివిటీ విస్తరిస్తే.. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాలపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గడంతో పాటు చిన్న నగరాలు, జిల్లా కేంద్రాలు కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఒకప్పుడు విమానం ఎక్కడం సామాన్యుడి కలగా ఉండేది. ఇప్పుడు చౌక టికెట్లు, పెరుగుతున్న ఎయిర్‌లైన్స్‌ పోటీ, కొత్త విమానాశ్రయాల నిర్మాణం.. ఈ మూడూ కలిసి ఆ కలను వాస్తవానికి మరింత దగ్గర చేస్తున్నాయి. భోగాపురం నుంచి మామునూరు వరకు విస్తరిస్తున్న ఈ ఎయిర్‌పోర్టుల మేళా.. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల రవాణా ముఖచిత్రాన్ని మార్చబోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

📄 Generate e-Paper Clip
Share This Article