యాదాద్రికి మరో అరుదైన గుర్తింపు.. జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డు రేసులో దేవస్థానం!
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదుగుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ప్రపంచ నేతలు, ఆధ్యాత్మిక ప్రముఖుల ప్రశంసలు అందుకున్న యాదగిరిగుట్ట దేవస్థానం.. ఇప్పుడు డిజిటల్ సేవల విస్తరణతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డు ఎంపిక ప్రక్రియలో యాదాద్రి దేవస్థానం చోటు సంపాదించడం విశేషంగా మారింది.
కొట్లాది రూపాయల వ్యయంతో పునర్నిర్మించిన యాదాద్రి ఆలయం భక్తులకు మరింత ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా సెలవు రోజుల్లో భారీగా భక్తులు తరలివస్తుండటంతో, వారి సౌకర్యార్థం ఆలయ అధికారులు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దర్శనం, సేవలు, సమాచార వ్యవస్థలను ఆధునికీకరించి భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆలయ ఈవో భవాని శంకర్ యాదాద్రి దేవస్థానంలో అమలు చేస్తున్న డిజిటల్ సేవలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా ఈ అవార్డు కోసం మొత్తం 802 దరఖాస్తులు అందగా, మొదటి దశలో 32 ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేశారు. తెలంగాణ నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంపిక కావడం ప్రత్యేకతగా నిలిచింది. అనంతరం జ్యూరీ సభ్యుల సమక్షంలో ఆలయ బృందం ఫైనల్ ప్రజెంటేషన్ సమర్పించింది.
జాతీయ స్థాయిలో యాదాద్రి ఆలయానికి వరుసగా గుర్తింపులు రావడం పట్ల ఆలయ ఈవో భవాని శంకర్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రసాదాల నాణ్యతకు గానూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ‘భోగ్’ సర్టిఫికేట్ అందుకున్న ఈ ఆలయం, పర్యావరణ పరిరక్షణకు ‘ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం’ అవార్డును కూడా దక్కించుకుంది. అంతేకాకుండా, అత్యంత పర్యావరణ అనుకూల ఆలయంగా ఐజీబీసీ నుంచి ప్లాటినం రేటింగ్ సైతం సాధించింది.