మెదక్‌లో దొంగల బీభత్సం..

NEWS DESK
1 Min Read

మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చొరబడి భారీగా బంగారం, వెండిని దోచుకెళ్లారు. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే… చీలపల్లి గ్రామానికి చెందిన రాయిని రాములు కుటుంబం ఒక వివాహ వేడుక కోసం ఊరెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు, వారి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో దాచిన సుమారు 120 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, కిలో వెండిని అపహరించుకుపోయారు. ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి, యజమానులకు, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ విషయం వెలుగులోకి వచ్చింది.

దొంగలు కేవలం రాములు ఇంటితో ఆగకుండా, అదే గ్రామంలోని మరో మూడు ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడ్డారు. మాణిక్యరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రెండు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీలు జరగడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article