తెలంగాణ వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన 17 కీలక సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తూ ‘ఫేస్‌లెస్ సేవలు’ ప్రారంభించింది. దీంతో చిన్న చిన్న పనుల కోసం ఇక ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆధార్ ధ్రువీకరణతో ఇంటి నుంచే ఈ సేవలను సులభంగా పొందవచ్చని రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి వెల్లడించారు. సేవల్లో పారదర్శకత పెంచడం, ప్రజలకు వేగవంతమైన సౌకర్యాలు అందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కొత్త విధానం ద్వారా లెర్నర్ లైసెన్స్‌లో పేరు, చిరునామా, ఫొటో, సంతకం మార్పులు, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్ జారీ వంటి సేవలను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ రీన్యువల్, డూప్లికేట్ DL, లైసెన్స్ రీప్లేస్‌మెంట్, పుట్టిన తేదీ సవరణ, బయోమెట్రిక్ అప్‌డేట్ వంటి ముఖ్యమైన సేవలు కూడా ఫేస్‌లెస్ విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం పౌరులు అధికారిక ‘సారథి’ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఇక ప్రమాదకర పదార్థాల రవాణాకు అవసరమైన హజార్డస్ ఎండోర్స్‌మెంట్, డూప్లికేట్ పీఎస్‌వీ బ్యాడ్జ్ జారీ, లైసెన్స్ నుంచి వాహన విభాగాల తొలగింపు వంటి సేవలు కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే లభించనున్నాయి. మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించి, ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ఈ ఫేస్‌లెస్ విధానం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ సేవలు వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉండగా, త్వరలోనే ‘నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్’ మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా స్మార్ట్‌ఫోన్‌తోనే తమ పనులను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం కలగనుంది. కార్యాలయాలపై పని భారం తగ్గించడంతో పాటు ప్రజల సమయం, శ్రమ ఆదా చేయడమే ఈ డిజిటల్ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని రవాణా శాఖ వెల్లడించింది.