నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు గర్భగుడి తాళాలు పగులగొట్టి వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించారు.
ఉదయం సుప్రభాత సేవలు నిర్వహించేందుకు వచ్చిన ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ గర్భగుడి తాళాలు ధ్వంసమైనట్లు గుర్తించి ఆలయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ తలుపులు తెరిపించి పరిశీలించగా చోరీ జరిగినట్లు నిర్ధారించారు.
దుండగులు ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పి చోరీకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ దుండగులు ఎలా ప్రవేశించారన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది.

అర్థరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వ్యాస మహర్షి ఆలయం వెనుక వైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. చోరీ అనంతరం వేదవ్యాస గుహ మార్గం ద్వారా పరారైనట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.