హైదరాబాద్: తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 15 నుంచి కొత్త సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. అర్హులను వెంటనే గుర్తించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కొత్తగా మంజూరు చేసే పింఛన్లతో పాటు తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులను కూడా అర్హుల జాబితాలో చేర్చి పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అర్హులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజా నిర్ణయంతో ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లైంది.
వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే దివ్యాంగ పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణించిన సందర్భంలో, నిబంధనల ప్రకారం అర్హత ఉంటే వారి జీవిత భాగస్వామికి పింఛన్ మంజూరు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఇకపై పింఛన్ పంపిణీ విధానంలోనూ మార్పు తీసుకొచ్చింది ప్రభుత్వం. గతంలో పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేసిన పింఛన్లను ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
అదేవిధంగా ప్రతి 45 రోజులకు మండల ప్రజా పరిషత్ సమావేశాలు నిర్వహించాలని, గ్రామాల్లో తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులు, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.