హైదరాబాద్: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోయిన లబ్ధిదారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది. తొలుత ఈ సడలింపును జీహెచ్‌ఎంసీ పరిధిలోని రేషన్ కార్డుదారులకు మాత్రమే వర్తింపజేయాలని భావించిన ప్రభుత్వం, జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న 'స్మార్ట్' ప్రక్రియతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గడువు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త కూడా ఉంది. ఈ-కేవైసీ పూర్తయిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా శనివారం నుంచి మూడు నెలల బియ్యం, ఇతర రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల సూచన మేరకు ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఆగస్టు 31లోపు సమీపంలోని రేషన్ దుకాణాన్ని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.