NetiPrasthanam.in – Telugu News & Breaking News Updatesవిశాఖలో కియా ఎక్స్‌పోర్ట్ హబ్.. శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్‌కు… › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 9:45 am
Date of Publish : 10 Jul 2026, 7:02 am  |  Posted by : NEWS DESK
👁 5 💬 0
Latest News

విశాఖలో కియా ఎక్స్‌పోర్ట్ హబ్.. శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్‌కు ఆహ్వానం.. కొరియాలో లోకేశ్ పెట్టుబడి దౌత్యం

విశాఖలో కియా ఎక్స్‌పోర్ట్ హబ్.. శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్‌కు ఆహ్వానం.. కొరియాలో లోకేశ్ పెట్టుబడి దౌత్యం

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఐదో రోజు గురువారం ఆయన ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, దక్షిణ కొరియా ప్రభుత్వ ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

సియోల్‌లో కియా మోటార్స్ గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హన్ లీతో పాటు సంస్థ ఉన్నతాధికారులను లోకేశ్ కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలను విస్తరించాలని కోరారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ (CKD) అసెంబ్లీ, ఎక్స్‌పోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

అనంతరం సెమీకండక్టర్లు, ఓఎల్ఈడీ డిస్‌ప్లే పరికరాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన సునిక్ సిస్టమ్స్ సీఈవో ఎస్.డబ్ల్యూ. చుంగ్‌తో సమావేశమయ్యారు. శ్రీసిటీలో డిస్‌ప్లే పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరిన లోకేశ్, అవసరమైతే జాయింట్ వెంచర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగ శాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌తోనూ లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3ఎస్ (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం పెట్టుబడిదారులకు భరోసానిస్తోందని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్-కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్, కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశాల్లో ఏపీ-దక్షిణ కొరియా పారిశ్రామిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.